Arjun Reddy Review – అర్జున్ రెడ్డి : రివ్యూ

0

రివ్యూ : అర్జున్ రెడ్డి

విడుదల తేదీ : ఆగష్టు 25, 2017

దర్శకత్వం : సందీప్ రెడ్డి వంగ

నిర్మాత : ప్రణయ్ రెడ్డి వంగ

సంగీతం : రాధన్

నటీనటులు : విజయ్ దేవరకొండ, షాలిని పాండే, ప్రియదర్శి తదితరులు ….

రేటింగ్ : 3/5

“అర్జున్ రెడ్డి” యువ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. పెళ్లి చూపులు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ మారిపోయిన విజయ్ కి ఈ సినిమా వివాదంతో మరింత పాపులారిటీ వచ్చింది. సినిమా పోస్టర్ అసభ్యంగా ఉండటంతో రాజకీయ నాయకులు కూడా ఈ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాటి సినిమాల వలన ఎలాంటి సందేశం ఇవ్వాలనుకున్నారు అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే విడుదల అయినా ట్రయిలర్ లోకూడా బూతులు ఉండటం సినిమాపై అనేక మందికి చేడు అభిప్రాయం వచ్చేలా చేసింది. అది అలా నేడు విడుదల అయినా ఈ సినిమా ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది…? సినిమా కథ ట్రైలర్ పోస్టర్ మాదిరి అసభ్యంగానే ఉందా…? ఈ సినిమా రివ్యూ మీకోసం.

కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని, విపరీతమైన స్వాతంత్ర్య ప్రవర్తన కలిగిన వ్యక్తిత్వం ఉన్న మెడికల్ స్టూడెంట్ అర్జున్ రెడ్డి (విజయ్ దేవరకొండ) కాలేజ్ లో తన జూనియర్ ప్రీతి శెట్టి (షాలిని పాండే) ను మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. కొన్నిరోజులకు ఆ అమ్మాయి కూడా అతనితో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత ఒకరినొకరు అర్ధం చేసుకుని శారీరకంగా కూడా దగ్గరవుతారు.

వీరి ప్రేమ గురించి తెలిసిన ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాళ్ళ ప్రేమను ఏ మాత్రం అర్ధం చేసుకోకుండా ప్రీతిని వేరే వాళ్లకు ఇచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది. ప్రేమించిన అమ్మాయిని వేరే వారికి ఇచ్చి పెళ్లి చెయ్యడంతో హీరో మానసికంగా క్రుంగి పోతాడు. మానసిక వ్యధకు గురై, పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిన అర్జున్ ఇంట్లోంచి బయటికొచ్చి, అన్ని చెడు అలవాట్లకు బానిసై రోజు రోజుకి కుంగిపోతుంటాడు. ఈ బాధలో అతను తాను ఎంతగానో ఇష్టపడి చదివిన వైద్య వృత్తిని కూడా వదిలేస్తాడు. ప్రేమించిన అమ్మాయి దూరం కావడం… ఎంతగానో ఇష్టపడి కష్టపడి చదివిన వైద్య వృత్తిని కూడా వదలడం… చెడు అలవాట్లకు దూరం కావడంతో అతని జీవితం ఏ మలుపులు తిరిగింది అనేది ఒక్కసారి చూద్దాం.

ప్లస్ పాయింట్స్:

సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్ కథ. అలాగే దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. స్వచ్ఛమైన ప్రేమలోని తీవ్రతను, అది విఫలమైనప్పుడు కలిగే భాధను గాఢమైన రీతిలో ప్రేక్షకులకు అర్ధమయ్యే విధంగా చెప్పడం . ఆ తర్వాత హీరో హీరోయిన్ల మధ్య ఉండే ప్రేమను దర్శకుడు స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేసిన విధానం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చిందనే చెప్పాలి.ముఖ్యంగా ఈ సినిమాని యువతని లక్ష్యంగా చేసుకుని తెరకెక్కించడంతో సినిమా చూసిన ప్రేక్షకులకు ముఖ్యంగా యువతకు ఈ ప్రేమ కథని ఇప్పట్లో మర్చిపోయే అవకాశం లేదు. అర్జున్ రెడ్డి గా విజయ్ నటనలో పరిణితి కనబరిచాడు. కోపాన్ని అదుపు చేసుకోలేని యువకుడిగా , ప్రేమించిన అమ్మాయి దూరం కావడంతో అతను ఏవిధమైన బాధని అనుభవించాడో తన నటన ద్వారా ప్రేక్షకులకు కళ్ళకు కట్టినట్టు చూపించాడు. హీరో సినిమాకే ప్రధాన బలం.

మొదటి భాగంలో హీరో ప్రేమలో పడటం , కాలేజీలో అతను ఏవిధంగా ఉండేవాడు.. అతని చదువు.. తర్వాత అమ్మాయి ఇతన్ని ప్రేమించడం ఆ తర్వాత అతని ప్రేమకి ఏర్పడిన అనేక ఇబ్బందులు వంటివి ఆశక్తికరంగా ఉన్నాయి. అలాగే రెండో భాగం విషయానికి వస్తే అర్జున్ రెడ్డి పడే భాధ, చెడు వ్యసనాలకు అలవాటుపడటం, వీటి ప్రభావం తో అతను ఎంతగానో ప్రేమించిన వైద్య వృత్తి దూరం కావడం వంటి సన్నివేశాలు దర్శకుడు కళ్ళకు కట్టినట్టు తెరకెక్కించాడు.. హీరో స్నేహితుడి పాత్రలో శివ ఆధ్యంతం స్నేహితుడికి సపోర్ట్ చేస్తూనే కొంచెం కామెడీ కూడా పండించాడు.. హీరోయిన్ షాలిని కూడా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది.ఇతర పాత్రలు కూడా సినిమాకి బలం చేకూర్చాయి అనే చెప్పవచ్చు.

మైనస్ పాయింట్స్:

రెండో భాగం ఆకట్టుకున్నా సాగదీత ఎక్కువగా ఉండటంతో సినిమా ఎప్పుడు అయిపోతుందా అనే ఫీలింగ్ వచ్చింది. అలాగే అర్జున్ రెడ్డి ప్రీతిని మర్చిపోవడానికి చేసే కొన్ని సీన్లు అతిగా అనిపించడమే కాక చిరాకు తెప్పించాయి. అయితే సినిమాలో ప్రధాన భాగాన్ని హైలెట్ చేసిన దర్శకుడు చివర్లో పాజిటివ్ గా ముగించే ప్రయత్నంలో వీక్షకులకు కాస్త అయోమయానికి గురిచేసి “ఎహె ఇదేంటి ” అనిపించేలా చేసింది. ఇది సినిమాకి ప్రధాన మైనస్.

హీరో ప్రేమలో పడటం వరకు బాగానే ఉన్నా ప్రతి సీన్ కాస్త ఓవర్ గా అనిపించింది. కేవలం యువతని లక్ష్యంగా చేసుకుని సినిమాని తెరకెక్కించడం సినిమాకి నెగటివ్ టాక్ తెచ్చే అవకాశం ఉంది. సినిమాలో అమ్మాయిని మర్చిపోవడం మీద దృష్టి పెట్టిన దర్శకుడు ఇతర సీన్ల విషయంలో అంత శ్రద్ధ కనబర్చలేదనే చెప్పాలి. చివరగా ఈ సినిమా కుటుంబ సమేతంగా చూసే సినిమా కాదని మొదటి భాగంలోనే ప్రేక్షకులకు అర్ధమైంది.

సాంకేతిక విభాగం పనితీరు:

తాను ఏవిధంగా కథ రాసుకున్నాడో తాను ఎలాంటి సినిమాని తెరకెక్కించాలి అనుకున్నాడో అందులో దర్శకుడు విజయవంతమయ్యాడు. హీరో కూడా అతనికి సహకరించడం తో సినిమా అనుకున్న విధంగా వచ్చింది. ఇక హీరో విషయానికి వస్తే పెళ్లి చూపులు సినిమాకి ఈ సినిమాకి పూర్తిగా వ్యత్యాసం చూపించాడు. దర్శకుడు అనుకున్న విధంగా నటించి మెప్పించాడు. ఆ క్యారెక్టర్ లో ఏ విధంగా ఉండాలో ఆ విధంగా నటించి మెప్పించాడు. దర్శకుడు ప్రతి సీన్ ని చాలా బాగా తెరకెక్కించిన కొన్ని సీన్ల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సింది.సినిమా సంగీతం కూడా ప్రేక్షకులను ఆకట్టుంది. సినిమాటోగ్రఫీ కూడా మెప్పించింది.

చివరిగా:

సినిమాని కేవలం ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే తీసుకుని తెరకెక్కించడం, చాలా సీన్లు అసభ్యంగా ఉండటం సినిమా కి నెగటివ్ టాక్ తెప్పించే అవకాశం ఉంది. హీరో ప్రభావం యువత మీద పడే అవకాశం ఉంది. సిసినిమా బాగుంది అనే విషయంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పవచ్చు